తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ధూల్పేటలో ఒక బర్త్డే పార్టీకి రూ. 10 లక్షలు ఖర్చు చేస్తారు.. పెళ్లికి అయితే రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. డబ్బులను వృధా చేయకూడదు. ప్రతి ఒక్కరూ డబ్బుల విలువ తెలుసుకోవాలి. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం దళిత కుటుంబాల కోసం దళిత బంధు అనే మంచి పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం ద్వారా దళితులందరూ లబ్ధి పొందాలి. మంచి వ్యాపారం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో మేం ఇలా బాగుపడుతున్నామని, పది మందికి మీరు చెప్పాలి. ఈ పథకం వల్ల మాకు ఇంత లాభం జరిగింది. మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులు సూచించాలి. ఏ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు.. సంబంధిత నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకుంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు.