తారాగణం: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్‌దేవ్‌గణ్, అలియాభట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అలీసన్ డూడీ, శ్రియ తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
కథ: విజయేంద్రప్రసాద్
సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
గత కొద్దిరోజుల నుంచి దేశమంతటా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఆవహించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, అనిశ్చితి మధ్య ప్రయాణం సాగించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కసారి యావత్ భారతీయ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచింది. ‘బాహుబలి’ సిరీస్‌తో దర్శకుడు రాజమౌళి దేశాన్ని ఓ ఊపు ఉపేయడంతో ఆయన బ్రాండ్ ఇమేజ్ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేసింది. వీటికి తోడు ఇద్దరు అగ్రహీరోలు ఈ సినిమా కోసం జతకట్టడం అభిమాన గణాల్లో ఆసక్తిని పెంచింది. దాదాపు నాలుగేళ్ల పాటు నిర్మాణం జరుపుకొని..కరోనా అవాంతరాల్ని ఎదుర్కొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగునాట ఇద్దరు పోరాటయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని కలబోసి దర్శకుడు రాజమౌళి ఆవిష్కృతం చేసిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్ని ఎంత మేరకు సంతృప్తిపరిచింది? నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తగిన ప్రతిఫలం లభించిందా? సమకాలీన తెలుగు సినిమా చరిత్రలో మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్‌గా అభివర్ణించిన ‘ఆర్ఆర్ఆర్’ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకుందో లేదో చూద్దాం..
కథా సంగ్రహం
1920 దశకం నేపథ్యంలో జరిగే కథ ఇది. అప్పుడు హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలనలో ఉంది. ఆ సమయంలో ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చిన బ్రిటీష్ ప్రభువు గోండు చిన్నారి మల్లిని తనవెంట ఢిల్లీకి తీసుకెళ్తాడు. ఆ చిన్నారిని రక్షించి తీసుకురావడానికి గోండు జాతి కాపరి భీమ్ (ఎన్టీఆర్) ఢిల్లీకి వెళతాడు. అక్కడ అక్తర్ అనే మారుపేరుతో సంచరిస్తూ మల్లిని కాపాడే మార్గాల కోసం అన్వేషిస్తుంటాడు. మరోవైపు రామరాజు ( రామ్‌చరణ్) బ్రిటీష్ ప్రభుత్వం దగ్గర నమ్మకస్తుడైన పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. వారు చెప్పినది ఆచరిస్తూ వృత్తిలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటాడు. తమ దగ్గర బందీగా ఉన్న చిన్నారి మల్లిని తీసుకెళ్లడానికి గోండు వీరుడు భీమ్ ఢిల్లీలో సంచరిస్తున్నాడన్న విషయం బ్రిటీష్ ప్రభుత్వానికి తెలుస్తుంది. అతన్ని బంధించే బాధ్యతను రామరాజుకు అప్పగిస్తారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారి మధ్య విడదీయలేని స్నేహం చిగురిస్తుంది. భీం తన లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? రామరాజు బ్రిటీష్ ప్రభుత్వం దగ్గర పోలీస్ అధికారిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? అసలు అతని జీవితాశయం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా మిగతా చిత్ర కథ సాగుతుంది..
కథా విశ్లేషణ..
ఈ సినిమా గురించి ప్రకటించిన రోజునే…కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల చారిత్రక నేపథ్యానికి కల్పన జోడించి ఈ కథను రాసుకున్నానని చెప్పారు రాజమౌళి. వివాదాలకు దూరంగా దీనిని కేవలం ఫిక్షనల్ కథగానే చూడాలని కోరారు. ఇక్కడే దర్శకుడిగా రాజమౌళి తంత్రం బాగా పనిచేసింది. బ్రిటీష్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు యోధుల కథ అనేసరికి ప్రేక్షకుల్లో సినిమాపై దేశభక్తి భావనతో పాటు పాత్రలపరంగా ప్రగాఢమైన ఇంపాక్ట్ క్రియేట్ అయింది. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు సమకాలీనులైన వారు ఎప్పుడూ కలుసుకోలేదు. వీరిద్దరి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే ఊహ నుంచి ఈ కథ రాసుకున్నారు రాజమౌళి. దీనికి హృదయాల్ని కదిలించే భావోద్వేగాల్ని, దేశభక్తి భావాన్ని రంగరించారు. చారిత్రక అంశాలకు ఫిక్షన్ జతచేసి కథావిష్కరణలోనే కొత్తదానాన్ని చూపించారు రాజమౌళి.
సినిమా ఆరంభంలోనే నిప్పు, నీరు ప్రతీకలుగా ఇద్దరు కథానాయకుల్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. వీరిద్దరి ఉపోద్ఘాత ఘట్టాల్ని రొమాంచితంగా ప్రజెంట్ చేశారు. వేల సంఖ్యలో ఉన్న ప్రజలపై లాఠీఛార్జ్ చేస్తూ రామ్‌చరణ్ ..పులిని బంధిస్తూ ఎన్టీఆర్ చేసిన విన్యాసాల నేపథ్యంలో ఈ ఇంట్రడక్షన్ సీన్స్ రాజమౌళి మార్క్‌ను ప్రతిబింబించాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. నీళ్లలో పడ్డ బాబుని రక్షించే క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఈ ఎపిసోడ్లో ట్రైన్ బ్లాస్ట్ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. ఇక అక్కడి నుంచి కథ వేగంగా నడుస్తుంది. భీమ్ ఓ బ్రిటీష్ దొరసానిని ఇష్టపడతాడు. వారిద్దరు చేరువకావడానికి రామరాజు సలహాలు ఇస్తుంటాడు. అయితే ఈ ఎపిసోడ్ కథాగమనంలో అంతగా అతకలేదనిపిస్తుంది. రామ్-భీమ్ మధ్య స్నేహాన్ని చూపించడానికి ‘నాటు నాటు’ పాట బాగా ఉపయోగపడింది. భీమ్ అమాయకత్వాన్ని చూసి రామరాజు అతనిపై మమకారం పెంచుకోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఇద్దరి స్నేహబంధాన్ని చక్కగా ఆవిష్కరించాయి. అయితే భీమ్ గురించి రామరాజు నిజం తెలుసుకోవడంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. అక్కడి నుంచి ఇద్దరి పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడతాయి. చిన్నారి మల్లిని రక్షించడానికి భీమ్ బ్రిటీష్ కోటను బద్దలు కొట్టే ప్రయత్నం చేయడం..దానిని రామరాజు అడ్డుకోవడం ఉత్కంఠగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ ఎపిసోడ్లో కావాల్సినంత యాక్షన్ పండింది. తొలి భాగమంతా భీమ్ చుట్టూ కథను నడిపించారు. అతని పాత్రపై ప్రేక్షకులకు ఓ రకమైన సానుభూతి కలుగుతుంది. బ్రిటీష్వారికి నమ్మకస్తుడైన పోలీస్ అధికారిగా రామరాజు పాత్ర తొలుత కొంచెం నెగెటివ్ ఛాయలతో సాగినట్లు కనిపించినా…అతని ఆశయం గురించి తెలిసిన తర్వాత పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను రొమాంచితంగా తీర్చిదిద్దారు. ఇద్దరు హీరోలు తాళ్లు పట్టుకొని వేలాడుతూ ఛాలెంజ్ చేసుకోవడం ప్రేక్షకుల్లో ఓ ఊపును తీసుకొస్తుంది.
రాజమౌళి సినిమాల్లో పాత్రల మధ్య సంఘర్షణ..ఒకరి ఆశయం కోసం మరొకరు సహాయం చేసుకోవడం ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. ఎమోషన్స్‌ను పతాకస్థాయిలో ఆవిష్కరించడం రాజమౌళి ట్రేడ్ మార్క్. ఈ సినిమా విషయంలోనూ అదే పంథాను అనుసరించారాయన. హీరోల మధ్య స్నేహం, అపార్థాలు, వైరం వంటి ఉద్వేగాల్ని తనదైన శైలిలో మనసును కదిలించేలా తెరపై తీసుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి ప్రతిభావంతులైన నటులు తోడుకావడంతో తాను అనుకున్న భావోద్వేగాల్ని పండించగలిగాడు. ప్రథమార్థమంతా వేగంగా సాగిన కథనం ద్వితీయార్థంలో కాస్త మందగించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అజయ్‌దేవ్‌గణ్ ఎపిసోడ్ పాత ఫార్మాట్‌లా అనిపిస్తుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిపోడ్‌లో రామరాజు ఆశయం ఏమిటో వివరించిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. భీమ్‌కు శిక్ష విధించే సందర్భంలో వచ్చే ఘట్టాలు హైలైట్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ‘కొమురం భీముడో..’ అనే పాట ఎమోషనల్‌గా సాగింది. ఇద్దరు కథానాయకులు తమ ఆశయాల్ని తెలుసుకొని బలమైన శత్రువు బ్రిటీష్ ప్రభువుపై పోరాటం చేయడం మెప్పిస్తుంది. ఇక ైక్లెమాక్స్ ఘట్టాల్లో రాజమౌళి ఎమోషన్స్‌ను పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లాడు. రామరాజును భుజాలపైకి ఎత్తుకొని భీమ్ పరుగెత్తడం..ఈ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంది. పోరాటఘట్టాల్ని చాలా కొత్తగా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక పతాకఘట్టాల్లో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్‌చరణ్ విజృంభించాడు. బాణాలు సంధిస్తూ అతను శత్రువులపై విరుచుకు పడిన విధానం..ఆ ఎలివేషన్ సీన్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరికీ కథాగమనంలో సమప్రాధాన్యతనివ్వడం దర్శకుడు రాజమౌళి ప్రతిభకు నిదర్శనంలా అనిపిస్తుంది. ఓ గోండు చిన్నారిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు వీరులు ఒకరికొకరు పరిచయం కావడం..వారి ఆశయాన్ని సాఫల్యం చేసుకోవడమనే చిన్న పాయింట్‌ను రాజమౌళి తనదైన కథనకౌశలంతో అద్భుతంగా ఆవిష్కరించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పొచ్చు. వారి పాత్రలకు సమప్రాధాన్యతనిస్తూ తీర్చిదిద్దే విషయంలో రాజమౌళి ఎక్కడా లెక్కతప్పలేదు. ఇద్దరు హీరోల అభిమానులు సంతుష్టి చెందేలా యాక్షన్ ఘట్టాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు రాజమౌళి. నిజజీవితంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు..తెరపై కూడా ఆ బంధం ప్రతిఫలించింది. ఇద్దరూ పోటాపోటీ అభినయంతో రక్తికట్టించారు. ‘నాటు నాటు..’ పాటలో డ్యాన్సులతో అదరగొట్టారు. బ్రిటీష్ నటి ఓలివియా మోరిస్‌కు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. సీత పాత్రలో అలియాభట్ చక్కటి అభినయాన్ని కనబరిచింది. కథాగమనంలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది. ఇక అజయ్‌దేవ్‌గణ్, శ్రియ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో కనిపిస్తారు. వారి పాత్రల పరిధి తక్కువైనా గుర్తుండిపోతాయి. రాహుల్ రామకృష్ట పాత్ర నిడివి కొద్దిసేపైనా కథలో కీలకంగా అనిపిస్తుంది. సముద్రఖని ఫర్వాలేదనిపించాడు.
ఇక సాంకేతికాంశాల్లో సినిమా ప్రతి విభాగంలో ఉన్నతంగా అనిపించింది. రాజమౌళి అంటేనే భారీతనానికి చిరునామా. ఈ సినిమాను ఓ విజువల్ వండర్లా తీర్చిదిద్దాడు. సెట్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే గ్రాఫిక్స్ మాత్రం ఆశించిన ప్రమాణాలతో లేవనిపించాయి. పులి తాలూకు కొంచెం కృత్రిమంగా అనిపించాయి. కీరవాణి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. సన్నివేశాలకు ఎమోషనల్ ఫీల్‌ను తీసుకురావడంతో బీజీఎమ్ ప్రధాన భూమిక పోషించింది. కెమెరామెన్ సెంథిల్ కుమార్ ప్రతి సన్నివేశాన్ని అందంగా ప్రజెంట్ చేశాడు. రాజమౌళి ఊహాలోకాన్ని ఆద్భుతంగా తెరపై తీసుకొచ్చాడు. ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్ వేసిన సెట్స్ బాగున్నాయి. బ్రిటీష్ కాలంనాటి వాతావరణాన్ని సహజంగా ఆవిష్కరించాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది యాక్షన్ కొరియోగ్రాఫర్ సాల్మన్ గురించి. యాక్షన్ సీక్వెన్స్‌ను వినూత్నంగా తీర్చిదిద్దాడు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు మెరిశాయి. ఇక నిర్మాణపరంగా ఉన్నత ప్రమాణాలు కనిపించాయి. భారీ హంగులతో సినిమా ఆద్యంతం విజువల్ ట్రీట్‌లా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్..
ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటాపోటీ నటన
రొమాంచింతంగా సాగిన యాక్షన్ ఎపిసోడ్స్
పాటలు, నేపథ్య సంగీతం..భారీ సెట్స్
మైనస్ పాయింట్స్
కొన్ని సన్నిశేశాల్లో లాజిక్ మిస్‌కావడం
ద్వితీయార్థంలో కాస్త మందగించిన కథనం
తీర్పు:
ఈ సినిమా ద్వారా రాజమౌళి నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం లభించిందని చెప్పొచ్చు. ఇద్దరు స్టార్‌హీరోల పర్ఫార్మెన్స్తో ఈ సినిమా అభిమానులకు డబుల్ బొనాంజాల అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి భారతీయ బాక్సాఫీస్‌పై మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు.
రేటింగ్: 3/5
Source : Namasthe Telangana