తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ తింటే బిర్యానీ తింటారు. లేదా ఇరానీ చాయ్ అయిన తాగుతారు. ఇద్దరు ముగ్గురు దోస్తులు కల్సి ముచ్చట్లు పెట్టాలన్నా కానీ ఇరానీ చాయ్ దుఖాణానికెళ్లి మరి చాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఇరానీ చాయ్ ధరను పెంచాలని హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఈరోజు శుక్రవారం నుండి ఇరానీ చాయ్ పై రూ.5లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. పదిహేను నుండి ఇరవై రూపాయలకు పెంచారు. అయితే గత మూడేండ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం ఇరానీ చాయ్ హోటళ్లపై కూడా పడింది.
ప్రస్తుతం మార్కెట్లో ఇరానీ చాయ్ పత్తా ధర కిలో రూ.300ల నుండి రూ.500కు చేరుకుంది. నాణ్యమైన పాలు ధర లీటర్ వందకు పెరగడం.. గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.1000కి పైగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరానీ చాయ్ హోటళ్ల బృందం తెలిపింది.