రాజధాని, సీఆర్డీఏ చట్టాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఉందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజధాని విషయంలో కేంద్రం చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు మూల స్తంభాలని.. రాజ్యాంగం ప్రకారం ఈ మూడూ తమ పరిధులకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు పేర్కొందని.. అందుకే ఈ విషయంపై చర్చించాల్సి వస్తోందని చెప్పారు.
హైకోర్టు తీర్పు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉందని.. శాసనసభ అధికారాలను హరించేలా ఉందని జగన్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం చూసినా రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని.. తమ పాత్ర ఉంటుందని కేంద్రం కూడా ఏనాడూ చెప్పలేదన్నారు. రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశంమంటూ ఆర్టికల్ 3లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమే హైకోర్టులో అఫిడవిట్ రూపంలో తెలియజేసిందని జగన్ గుర్తుచేశారు. టీడీపీ ఎంపీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం ఆ సమాధానమే చెప్పిందన్నారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వమే ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత రాష్ట్రానికి ఆ అధికారం లేదని హైకోర్టు చెప్పడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. హైకోర్టును అగౌరవ పరచాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పడం లేదని.. ఉన్నత న్యాయస్థానంపై తమకు ఎంతో గౌరవముందన్నారు. అయితే శాసనసభ గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
వికేంద్రీకరణపై తగ్గేదేలే
రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడతామని.. వారికి అండగా ఉంటామని జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని.. దాంతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గమని.. రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని.. రాజధానులపై నిర్ణయం తమ హక్కు బాధ్యత అని జగన్ ఫుల్ క్లారిటీతో చెప్పారు. ప్రజలంతా ఎన్నుకుంటే ఏర్పడిన ప్రభుత్వం తమదని.. అలాంటిది తాము ప్రశ్నించలేకపోతే లెజిస్టేచర్‌కి అర్థమే ఉండదన్నారు.