ఏ ప్రభుత్వ విధానాలైనా నచ్చకపోతే ప్రజలే వారిని ఇంటికి పంపిచేస్తారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలన నచ్చపోవడంతోనే 175 స్థానాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని చూసి ప్రజలే తీర్పు ఇస్తారని.. ప్రజాస్వామ్యం గొప్పతనం ఇదేనని చెప్పారు. శాసనసభలో వికేంద్రీకరణపై అంశంపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అసాధ్యమైన టైం లైన్స్‌తో నెలరోజుల్లో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలనుకుకోవడం.. ఆరునెలల్లో రూ.4-5లక్షల కోట్లు ఖర్చు చేసి రాజధాని కట్టేయాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదనే తొలిసారి తెలంగాణ ఉద్యమం వచ్చిందని.. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో అవుతోందనే రెండోసారి మళ్లీ అక్కడి ప్రజలు ఉద్యమించారని గుర్తుచేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని.. మూడు రాజధానుల బిల్లు సమయంలో ఈ విషయాలన్నీ సభ ముందు ఉంచామని వివరించారు. గతంలో చెప్పినవిధంగా మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ పునరుద్ఘాటించారు.