అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ అంటూ ప్రత్యేకంగా భజన చేయించుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సభలో అప్పటి పాటను ప్లే చేశారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరంలోని వివిధ శంకుస్థాపనల పేరిట ప్రజాధనాన్ని వృధా చేశారని సీఎం విమర్శించారు. స్పిల్‌వే కాంక్రీట్ శంకుస్థాపన, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాపర్ డ్యామ్ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్ల పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో రూ.కోట్ల ప్రజాధనం వృధా అయిందని జగన్ అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని.. ఇప్పుడు చేస్తున్న కుట్రలతో వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయనకు ఓటమి తప్పదని సీఎం అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు జగన్ వివరించారు.