అమరావతి: సారాను విచ్చలవిడిగా ఊరూరా ప్రవహించేలా చేసింది టీడీపీ చీఫ్ చంద్రబాబే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. శాసనసభలో నారాయణస్వామి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సారా వ్యవహారంలో రూ.550కోట్లను చంద్రబాబు కొల్లగొట్టారని.. ఆయనపై కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆయనకు బాగా తెలుసని చెప్పారు. ఆ కేసులో ఏసీబీ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు. నారాయణస్వామి తన ప్రసంగంలో మధ్యలో వేసిన ఛలోక్తులు, వ్యంగ్యస్త్రాలకు సీఎం జగన్ సహా సభ్యులంతా పగలబడి నవ్వారు.
జగన్‌ను కొంచెం కూడా కదిలించలేరు
‘‘చంద్రబాబు ఎంతమంది సినిమా వాళ్లను, ఇతర పార్టీల వాళ్లను టీడీపీలో చేర్చుకున్నా జగన్‌ను కొంచెం కూడా కదిలించలేరు. జగన్‌ది ఎప్పుడూ ఒంటరి పోరాటమే.. చంద్రబాబు అలా చేయలేరు. మేమంతా జగన్ గాలితో గెలిచినోళ్లమే. నా అంతటి వాడు లేడు అనే వాళ్లంతా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి అలాగే చెప్పారు. . ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి సోనియా గాంధీ వరకు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి వచ్చింది. చంద్రబాబుతో కలిసి వాళ్లంతా కుట్రలు పన్ని ఏ పాపం తెలియని జగన్‌ను జైల్లో పెట్టించారు. పెట్టిన కేసుల్లో ఒక్కటైనా నిరూపించగలిగారా? ఇప్పటికే సోనియా ఫ్యామిలీ జీరో అయింది.. రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు ఇక సీఎం అయ్యే ప్రశ్నే లేదు.
టీడీపీ ఎమ్మెల్యేలను రండి అంటే వచ్చేస్తారు.. కానీ..
నాకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. జగన్‌పై విశ్వాసం పెట్టుకున్నా.. ఆయనే అవకాశమిచ్చారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని తలచుకుంటే ఏడుపొస్తుంది. దేశంలో ఏ సీఎం చనిపోయినా ఇన్ని విగ్రహాలు పెట్టారా? ఆ వ్యక్తి కుటుంబంపై ఎందుకు ఇలా పడుతున్నారు? సింహాన్ని చూస్తే మిగతా జంతువులు పారిపోతుంటాయి. అలాంటి సింహమే జగన్‌మోహన్‌రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేలను జగన్ రండి అంటే వచ్చేస్తారు.. ప్రతిపక్షమే ఉండదు. కానీ జగన్ వ్యక్తిత్వం అదికాదు. జగన్ సీరియస్ అవ్వడమనేదే ఉండదు. కానీ చంద్రబాబు నవ్వడం ఎప్పుడైనా చూశామా? మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని మొదట్లోనే సీఎం చెప్పారు. అలాగే చేయడానికి సిద్ధమవుతున్నారు. మాకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆనందంగా అంగీకరిస్తాం. నన్ను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు, వాళ్ల తాత, ముత్తాతలు వచ్చినా సాధ్యం కాదు. రాజు సమర్థులైతే రాజద్రోహులంతా ఒక్కటవుతారు’’ అంటూ తనదైన శైలిలో నారాయణస్వామి వ్యాఖ్యానించారు.