Home / ANDHRAPRADESH / పవన్‌.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్‌ పాలిటిక్స్‌?

పవన్‌.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్‌ పాలిటిక్స్‌?

‘దరువు.కామ్‌’ ప్రత్యేక కథనం

అది మార్చి 14, 2014.. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్‌ కట్‌ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన ప్రస్థానంలో ఆ పార్టీ కానీ.. దాని అధినేతగా పవన్‌కల్యాణ్‌ కానీ సాధించిందేంటి? ఇప్పటికీ గ్రౌండ్‌ లెవెల్లో సరైన కేడర్‌ లేకపోవడానికి..కారణాలేంటి? పవన్‌ స్వతహాగా పార్టీని ఇంకెప్పుడు జనాల్లోకి తీసుకెళ్తాడు? వారి అభిమానాన్ని ఎప్పుడు సంపాదిస్తారు? 2024లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఎలా ప్రకటించేశారు?

పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లలేరా?

ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ ప్రసంగం వింటే రాజకీయాల్లో ఆయన నేర్చుకోవాల్సింది.. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపించక మానదు. ముందు పార్టీ ఏ స్థితిలో ఉందో తెలుసుకోకుండా 2024 ఎన్నికల్లో అధికారం జనసేనదే అని ప్రకటించడం ఎంత అవగాహనా రాహిత్యం! నిజంగా పవన్‌ పార్టీకి అంత దమ్ముందా? వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తామని.. అవసరమైతే పొత్తులకు సిద్ధమని ప్రకటించడమేంటి? పవన్‌ ఇంకెన్నాళ్లు డిపెండింగ్‌ టైప్‌ పాలిటిక్స్‌ చేస్తారు? ఆవిర్భావ సభలో పొత్తులపై పవన్‌ చేసిన కామెంట్స్‌ చూస్తే ఎప్పటిలాగే టీడీపీతో దోస్తీకి నేను మళ్లీ సిద్ధమే అని ఇన్‌డైరెక్ట్‌గా ప్రకటించడమేనా? చంద్రబాబు వన్‌ సైడ్‌ లవ్‌ కామెంట్స్‌కి పవన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసినట్లేనా? పొత్తు లేకుండా జనసేన పార్టీ ఎన్నికలకు వెళ్లలేదా?

ఆ ఫీలింగ్‌ నిజమేనా?

పవన్‌ కల్యాణ్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. సినిమాల్లో ఆయన మేనరిజమ్స్‌.. వ్యక్తిగత జీవితంలో నలుగురికి సహాయపడుతుంటారనే ప్రచారమే దీనికి ప్రధాన కారణం. అభిమానులను.. వారి అభిమానాన్ని తక్కువగా చూడలేం కానీ.. వాళ్లని పవన్‌ అవకాశానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారనే అపవాదు కూడా ఉంది. రాజకీయాల పట్ల వాళ్లలో ఉన్న ఎమోషన్స్‌ను సందర్భాన్ని బట్టి పవన్‌ క్యాష్‌ చేసుకుంటున్నారేమో అనే నెగిటివ్‌ ఫీలింగ్‌ కూడా కొందరికి వస్తోంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. పార్టీ ప్రకటించినప్పటి నుంచి ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్స్‌ వరకు జరిగిన పరిణామాలను ఓసారి పరిశీలిస్తే ఆ ఫీలింగ్‌ నిజమేనేమో అనిపించక మానదు.

2014లోనే జగన్‌ సీఎం అవ్వాల్సింది కానీ..

పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. అభ్యర్థులను బరిలోకి దించకపోయినా టీడీపీ, బీజేపీకి పవన్‌ మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో అనుభవం ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వాలనే స్లోగన్‌ను ఆయన ఎత్తుకున్నారు. సరే అప్పటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అలాగే భావించడంతో దాని వల్ల టీడీపీకి చాలా వరకు ప్రయోజనం కలిగింది. కేవలం 0.4 శాతం ఓట్‌ షేర్‌తో అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే పవన్‌ కల్యాణ్‌ మద్దతే లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదు. ఎందుకంటే జనసేన టీడీపీకి సపోర్ట్‌ చేయడంతో చాలా అసెంబ్లీ స్థానాల్లో తక్కువ మార్జిన్‌తోనే వైసీపీ ఓడిపోయింది. లేదంటే 2014లోనే సీఎం పీఠాన్ని జగన్‌ అధిరోహించేవారు. ఎన్నికలు ముగిశాయి.. చంద్రబాబు సీఎం అయ్యారు. కొన్నాళ్లు గడిచాయి. టీడీపీ ప్రభుత్వంపై క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. రాజధాని అమరావతి విషయంలో బలవంతపు భూసేకరణ,ఊరూరా జన్మభూమి కమిటీలతోనే పాలన కొనసాగించడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. గ్రామాల్లో పనులు జరగాలంటే జన్మభూమి కమిటీలతో బేరసారాలు సాగించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ మాత్రం అడపాదడపా వచ్చి ఏదో తూతూమంత్రంగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేసి మళ్లీ కొన్నాళ్లు కనిపించకుండా పోయేవారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్‌ మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన సభలు నిర్వహించారు. ఆ సమయంలో కర్నూలు, అనంతపురంలో ఆ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని అమరావతిపైనే దృష్టి పెడితే మిగతా ప్రాంతాల సంగతేంటని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వ విధానాలపై ఎన్నో విమర్శలు కూడా చేశారు.

ఆ ఒక్కటే తేడా.. మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌

ప్రజలకు మేలు చేసేలా సమస్యలపై ప్రశ్నిస్తున్నారని అనుకునేలోపే పవన్‌ ఆ భ్రమలను తొలగించేశారు. అప్పటి వరకు ప్రభుత్వ వ్యతిరేకతపై మాట్లాడిన పవన్‌.. 2019 ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి స్వరం మార్చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబును ప్రశ్నించడం మానేసి వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందరూ ఊహించినట్లుగానే 2014 ఎన్నికల మాదిరిగానే 2019లోనూ టీడీపీకే పవన్‌ ఫేవర్‌ చేశారు. అయితే 2014లో డైరెక్ట్‌గా.. 2019లో ఇన్‌డైరెక్ట్‌గా.. అంతే తేడా.. మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌! వ్యతిరేక ఓటు చీల్చకుండా జాగ్రత్తగా పవన్‌ ముందుకు కదిలారు. ఈ క్రమంలో పెద్దగా ప్రయోజనం లేని చిన్నాచితకా పార్టీలతో చేతులు కలిపి పొత్తు పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీలు, బీఎస్పీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. పైకి బీజేపీ, టీడీపికి వ్యతిరేకమనే భావన కల్పించి ఇన్‌డైరెక్ట్‌గా ఆ పార్టీలకు లాభం చేయాలనుకున్నారు. ప్చ్‌.. ఈసారి ప్రజలకి అర్థమైపోయింది. జనసేనను నమ్మలేదు సరికదా.. ఏకంగా పవన్‌ను కూడా గెలవకుండా చేశారు. అదే సమయంలో ఆయన ప్లాన్‌ ప్రకారం గెలవాల్సిన టీడీపీ కూడా గెలవకుండా కేవలం 23 సీట్లతోనే బొక్కబోర్లాపడింది. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు ఏమాత్రం సంకోచించకుండా ఫుల్‌ క్లారిటీతో జగన్‌ నేతృత్వంలోని వైసీపీకి 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని అందించారు.

జగన్‌పై ఎందుకంత కడుపుమంట? 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది. వాలంటీర్‌, గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరుతున్నాయి. జగన్‌ సీఎం అయిన తర్వాత ఏపీలో ప్రతి కుటుంబం సగటును ఇప్పటి వరకు దాదాపు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ప్రయోజనం పొందింది. ముఖ్యంగా కరోనా సమయంలో కేంద్రప్రభుత్వ సహకారంతో పేదలను జగన్‌ ఆదుకున్న తీరుపై ప్రశంసలు లభించాయి. కరోనా పరిస్థితులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినా సంక్షేమ పథకాలను జగన్‌ ఆపలేదు.  తన తండ్రి వైఎస్‌ఆర్‌లా ఇచ్చిన మాట ప్రకారమే ముందుకెళ్లాలనే ఒకే ఒక్క మాట జగన్‌ను ఆ విధంగా నడిపించింది. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలపైనా స్పీడ్‌ పెంచారు. మంచి విద్య, వైద్యంతో పాటు కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. అలా ‘మన బడి-నాడు నేడు’కార్యక్రమంతో రాష్ట్రంలోని పాఠశాలలను, హాస్పిటళ్ల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలు వదిలేసి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న దాదాపు 90 శాతం హామీలను ఇప్పటికే జగన్‌ అమలు చేసేశారు. దీంతో ఆయనకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దానికి నిదర్శనమే స్థానిక ఎన్నికలు. సర్పంచ్‌.. ఎంపీటీసీ.. జడ్పీటీసీ ఇలా ఏ ఎన్నికలైనా వైసీపీకి తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. ఇంత చేస్తున్నా పవన్‌ కల్యాణ్‌ మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ జగన్‌ను టార్గెట్‌ చేస్తూ వెళ్తున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు జగన్‌పై ఉన్న ద్వేషాన్ని చెప్పకనే చెప్తున్నాయి. 2014 నుంచి 2022 దాకా.. ఇంకా 2024 వరకూ జగన్‌పైనే ఎందుకంత కడుపుమంట?

పవన్‌ వెకేషన్‌ పాలిటిక్స్‌!

చంద్రబాబులాగే పవన్‌ కూడా హైదరాబాద్‌లో ఉంటూ అడపాదడపా ఏపీకి వస్తుంటారు. ఓ వైపు సినిమాలు చేసుకుంటూ ‘కాల్‌షీట్లు ఖాళీగా ఉన్నప్పుడే రాజకీయాలు’ అన్నట్లుగా వచ్చి వెళ్తుంటారు. జనాలు మర్చిపోతారేమో అనుకునేలా వెకేషన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఏదైనా సందర్భం చూసుకుని తన పార్టీ నుంచి ఓ ప్రెస్‌నోట్‌ విడుదల చేసి నేనూ రాజకీయాల్లో ఉన్నాను అనిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్లారు. అప్పుడు టీడీపీ గెలవగానే మళ్లీ విడిపోయినట్లు డ్రామా నడిపించారు. 2019 ఎన్నికల్లో గుర్తుకురాని వ్యతిరేక ఓట్ల చీలిక.. అదేంటో 2024కి మాత్రం అవసరమట. ప్రజలంతా జనసేన వెనకే ఉంటారని.. 2024లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనేలా ఆవిర్భావ సభలో పవన్‌ ఊదరగొట్టేశారు. అసలు జనసేనలో ఆ పార్టీ పరిస్థితిపై ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? లేదా? లోకల్‌ బాడీ ఎన్నికల్లో కనీసం 10 ఎంపీపీ స్థానాలు, 10 జడ్పీటీసీ స్థానాలు కూడా రాలేదు. ఆవిర్భావ సభ వేదికపై చెప్పుకోదగ్గ 10 మంది నేతలైనా లేరు. ఆ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చేస్తుందా? దీన్ని జనం నమ్మాలా? కిందిస్థాయి పరిస్థితులను ఏమాత్రం రివ్యూ చేసుకోకుండా నేనేం చెప్పినా నమ్ముతారని పవన్‌ కల్యాణ్‌ అనుకుంటున్నారా?

ఆ సమస్యలపై కేంద్రాన్ని ఎందుకు కలవలేదు?

రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆ రెండూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఏనాడైనా ఆ సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించారా? తూతూ మంత్రంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై మాట్లాడారు తప్ప.. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పెద్దలను కలిసి సమస్యను, ఆంధ్ర ప్రజల ఆవేదనను వివరించే ప్రయత్నం చేశారా? ఎంతసేపూ వైసీపీ ఎంపీలు చేయాలనే విధంగానే మాట్లాడితే ఎలా? లోక్‌సభ, రాజ్యసభల్లో వైసీపీ ఎంపీలు ఈ అంశాలను ప్రతిసారీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇంత తీవ్రమైన సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్‌ కల్యాణే చొరవ తీసుకుని పరిష్కరించగలిగితే ఆ క్రెడిట్‌ వచ్చేది పవన్‌ కల్యాణ్‌కే కదా! అదే జరిగితే ప్రజలకీ ఆయన పార్టీపట్ల, పవన్‌ నాయకత్వంపైన నమ్మకం కలుగుతుంది కదా! అలా చేయకుండా టీడీపీలాగే వైసీపీనే నిందిస్తే జనసేనకు ఏం ఉపయోగం? దీన్ని పవన్‌ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు?

మర్రిచెట్టు నీడలో ఏ చెట్టూ ఎదగదు.. జనసేన పరిస్థితీ అంతేనా?

2024 ఎన్నికల్లో జనసేన సింగిల్‌గా ప్రజల్లోకి వెళ్తే ఈసారి కాకపోయినా 2029 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి అవకాశం ఇవ్వొచ్చు. అలా కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుని.. వారితోనే వెళ్తాను అంటే మాత్రం పవన్‌ను టీడీపీ రాజకీయంగా ఎదగనివ్వదు. జనసేన సిద్ధాంతాలు మంచివైతే సరిపోదు.. ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టేందుకు ఎంచుకునే మార్గం కూడా బావుండాలి. మరీ ముఖ్యంగా పొత్తు పెట్టుకునే పార్టీల ఉద్దేశాలను కూడా ప్రజలు గమనిస్తారు. నిజంగా మంచి ఉద్దేశాలైతే అవి ప్రజల్ని ఆకర్షించగలగాలి. ఇప్పటికైతే టీడీపీ పట్ల ప్రజలకి ఆ నమ్మకం లేదు. ఎంతసేపూ కుమారుడు లోకేశ్‌ను ఏదో ఒకలా సీఎం పీఠంపై కూర్చోబెట్టేయాలనే స్వార్థం చంద్రబాబుది. ఇలాంటి సమయంలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలు నిజమవుతాయి. ప్యాకేజీకి పవన్‌ లొంగిపోతున్నాడనే అపవాదును నిజం చేసినట్లే అవుతుంది. మర్రిచెట్టు నీడలో ఏ చెట్టూ ఎదగదు అన్నట్లుగా.. టీడీపీ నీడలో ఎన్నికలకు వెళ్తే జనసేన పరిస్థితీ అంతేనా?

ఉమ్మడి కూటమి సీఎం అభ్యర్థి అయ్యే దమ్ముందా?

నిజంగా టీడీపీకి జనసేన, పవన్‌ కల్యాణ్‌ పట్ల మంచి అభిప్రాయమే ఉంటే.. ఒకవేళ పొత్తు కుదిరితే.. టీడీపీ-జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించగలరా? అలా కోరగలరా? ఆ దమ్ము పవన్‌కు ఉందా? అది కచ్చితంగా జరగదు. ఓ వైపు తన కుమారుడు లోకేశ్‌ను సీఎం చేయాలనే తాపత్రయంతో ఉన్న చంద్రబాబు.. పవన్‌కు ఆ అవకాశమే ఇవ్వరు. ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ ప్రయోజనాలే ముఖ్యమనుకొని ఎన్నికలకు వెళ్తే మాత్రం జనసేనకు ఊహించని నష్టం జరుగుతుంది. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు! ఇప్పటికే 2014 ఎన్నికల్లో చంద్రబాబు పవన్‌ను రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆయనకున్న ‘వెన్నుపోటు’ గుణాన్ని పవన్‌కు మళ్లీ చూపిస్తాడనుకోవడంలో ఎలాంటి డౌట్‌ కూడా అక్కర్లేదు. నమ్మించినట్లే నట్టేట ముంచేయడంలో ఆయన దిట్ట కూడా.. ఇవన్నీ పవన్‌కు తెలియదా? అంటే అదీ కాదు. పవన్‌ ఇప్పటికి అఫీషియల్‌గా ప్రకటించకపోయినా టీడీపీతో పొత్తు అంటే జనసేనలోనే చాలా మంది కార్యకర్తలు కూడా వ్యతిరేకించే అవకాశముంది. అందుకే పవన్‌ తన పార్టీలో ఈ విషయాన్ని సమీక్షించుకుని కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా తీసుకుని 2024 ఎన్నికల్లో ముందుకెళ్లాలి. లేదూ నాకు ఇష్టం వచ్చినట్లు ఇలాగే వెళ్తా అంటే మాత్రం జనసేన, పవన్‌కల్యాణ్‌ భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat