విజయవాడ: కొత్తగా ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయని.. తామెప్పుడూ ఆదివాసీలు, మహిళలను చిన్నచూపు చూడలేదని చినజీయర్ స్వామి అన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణలో పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఆ వ్యాఖ్యల ముందు వెనుక ఏం జరిగిందన్నది చూడాలని చిన్నజీయర్ స్వామి అన్నారు. పూర్తి విషయం తెలుసుకోకుండా కొంత భాగాన్నే తీసుకుని ‘ఆ వ్యక్తి ఇలా అన్నాడు’ అంటే అది హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులకు. . ముఖ్యంగా మహిళలకు అగ్రస్థానం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని.. వాళ్లని చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదన్నారు.
ఆదివాసీ దేవతలను తూలనాడినట్లు జరుగుతున్న ప్రచారం సరికాదని చెప్పారు.‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ అనేది తమ నినాదమని చినజీయర్ చెప్పారు. మనం దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలని.. అన్నీ నమ్మాల్సిన అవసరం లేదన్నారు. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసేలా తాను మాట్లాడానని అనుకోవడం పొరపాటని చెప్పారు.