కరీంనగర్: సొంత నియోజకవర్గ యువతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని.. ఇప్పుడు ఎంపీగా ఉన్న సంజయ్ ఏం తీసుకొచ్చారని నిలదీశారు. కరీంనగర్ జిల్లాను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ఇక్కడి నుంచే మొదలుపెడతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ నుంచే శంఖారావాన్ని పూరించారన్నారు. కరీంనగర్ నగర పరిధిలో రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మిషన్ భగీరథ పైలాన్ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
కరీంనగర్‌లో రూ.వందలకోట్ల విలువైన అభివృద్ధి పనులు చేస్తున్నామని.. బండి సంజయ్ కనీసం రూ.3కోట్లయినా తెచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. చేనేత కార్మికుల కోసం క్లస్టర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని ఏనాడైనా కేంద్రాన్ని ఆయన అడిగారా? అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను తిట్టడం, సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప సంజయ్‌కు ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏం చేశారో ఆయనకే తెలియాలన్నారు.
రోజూ హిందూ, ముస్లిం అంటారని.. మత పిచ్చి కడుపు నింపదని చెప్పారు. కనీసం కరీంనగర్‌కు గుడినైనా తీసుకొచ్చారా? యువతకు ఏం చేశావ్? అని బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచేలా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అంతకుముందు తిమ్మాపూర్ మండలం రేణికుంటలో తెరాస కార్యకర్త కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల చెక్ అందజేశారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.