తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఒకటి రైతుబంధు. ఏడాదికి ఎకరాకు రూ పదివేల చొప్పున పంట పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులు ఒక నివేదికను పంపారు.
ఈ నివేదిక ఆధారంగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న దాదాపు 131మంది రైతుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో ఎవరైన అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు ఆధారాలు లభిస్తే వారికి ఖచ్చితంగా రైతుబంధును ఆపేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
ఈ చర్యల్లోనే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో నూట ముప్పై ఒకటి మంది రైతులు గంజాయి పండిస్తున్నట్లు తేలింది.వీరందరికి రైతుబంధు పథకాన్ని నిలిపేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే వీరీలో ఇప్పటికే 109మందికి రైతు బంధు ఆపినట్లు సమాచారం .