హైదరాబాద్: భాగ్యనగరం అభివృద్ధికి బీజేపీ నేతలు తమతో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో వరదముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్ల నిధులు తేవాలని.. అలా చేస్తే ఆయన్ను సన్మానిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ సర్కిల్ వద్ద జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్‌పాస్, బైరామల్ గూడలో ఫ్లైఓవర్‌లను కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదముంపు నివారణకు నగర వ్యాప్తంగా రూ.103 కోట్లతో నాలాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎల్బీ నగర్‌లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు ముందుకు రావాలని కేటీఆర్ కోరారు. రానున్న రెండు మూడు నెలల్లో కొత్తగా పెన్షన్లను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పారు.