హైదరాబాద్: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇకపై సమ్మె చేయడంలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. మరోవైపు సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.
బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అందుకుందని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తామన్నట్లుగా కేంద్రం చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి ఇది వ్యతిరేకమని.. ఇదే ధోరణి కంటిన్యూ అయితే దేశానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకునేలా చర్యలు చేపడుతున్నారని.. ఇది దుర్మార్గమని కేసీఆర్ మండిపడ్డారు. మతకలహాలు పెట్టి ప్రజలను విడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోనూ కలహాలు సృష్టించే ప్రయత్నాలు చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.