హైదరాబాద్: ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మెడిసిన్ విద్య మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మెడిసిన్ పూర్తి చేసేందుకు ఆ విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో కేసీఆర్ ప్రకటన చేశారు.
ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదివేందుకు వెళ్లిన 740 మంది తెలంగాణ విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చామని సీఎం తెలిపారు. అక్కడ రూ.25లక్షలతో మెడిసిన్ పూర్తవుతుందని.. ఇక్కడ రూ.కోటి ఖర్చు అవుతుందని చెప్పారన్నారు. ఇక్కడ అంత డబ్బు వెచ్చించలేని విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్లారని.. యుద్ధంతో అక్కడ పరిస్థితులు బాగోలేక వెనక్కి వచ్చేశారని చెప్పారు. అక్కడ పరిస్థితులు ఎప్పుడు కుదుట పడతాయో తెలియడం లేదని.. అందుకే వాళ్లంతా మెడిసిన్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినట్లు వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. దీనికి సంబంధించిన విషయాలపై కేంద్రంతో చర్చించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.