మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనదే అధికారమని.. సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చినపుడు ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రోడ్‌మ్యాప్ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం వద్ద జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించారు. ఏపీ భవిష్యత్ బాధ్యతను పవన్ కల్యాణ్, జనసేన పార్టీ తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల్లేనిదిగా చేయాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని చెప్పారు.
విజయవాడ, విశాఖపట్నం నగరాలను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతామని.. అధికారంలోకి రాగానే బలమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తామని పవన్ కల్యాణ్ వివరించారు. కర్నూలు జిల్లాకు మాజీ సీఎం, ప్రముఖ దళిత నేత దామోదరం సంజీవయ్య పేరు పెడతామని చెప్పారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఉచితంగా ఇసుకను అందిస్తామని.. నిరుద్యోగ యువతకు రూ.10లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పారు. ప్రతి సామాజిక వర్గానికి జనసేన అండగా నిలుస్తుందన్నారు.
మరోవైపు పొత్తులపై తాజాగా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. వైసీపీ బలంగా ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనని చెబుతూ పొత్తులకు ఇన్‌డైరెక్ట్‌గా ఓకే చెప్పేశారు. గతంలో జనసేనతో పొత్తుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరోక్షంగా ఆసక్తి చూపారు. కుప్పం పర్యటనలో వన్‌సైడ్ లవ్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ పొత్తులు ఉంటాయని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పకనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఓ వైపు బీజేపీ మరో వైపు టీడీపీతో కలిసి 2014 ఎన్నికల నాటి పొత్తుల సీన్‌ను జనసేనాని రిపీట్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.