హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ హసన్ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఛైర్మన్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. ప్రొటెం స్పీకర్ జాఫ్రి ఆయన్ను ఛైర్మన్‌గా స్థానంలో కూర్చోవాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలోని అత్యున్నత పదవుల్లో రైతు బిడ్డలు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని కేటీఆర్ అన్నారు. సీఎం, స్పీకర్, మండలి ఛైర్మన్ పదవుల్లో రైతులు ఉండటం గర్వకారణమని చెప్పారు.