హైదరాబాద్: నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై శరణ్‌కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2018లో రూ.85లక్షలు తీసుకున్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌పై బంజా రాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ల శరణ్ కంప్లైట్ చేశారు. దీంతో వారిపై కేసు ఫైల్ అయింది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. శరణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనతో పాటు తన కుమారుడిపై కేసు పెట్టారని మండిపడ్డారు.
శరణ్ తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. రూ.85లక్షలు ఇచ్చి ఉంటే ఏమైనా సాక్ష్యాలు చూపించాలని బెల్లంకొండ సురేష్ అన్నారు. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. శరణ్‌ది తమ ఊరేనని.. సినిమా టికెట్ల కోసం అప్పుడప్పుడూ తనకు ఫోన్ చేసేవాడని చెప్పారు. అక్కడ ఉండే డిస్టిబ్యూటర్లతో మాట్లాడి టికెట్లు అందేలా చూసేవాడినని సురేష్ వెల్లడించారు. అలాంటి వ్యక్తి ఈరోజు తమపై కేసు పెట్టాడన్నారు. శరణ్ వెనుక ఉన్న ఓ రాజకీయ నేత ఆయనతో ఇవన్నీ చేయిస్తున్నారని చెప్పారు. ఆ రాజకీయ నేత ఎవరో ఆధారాలతో సహా త్వరలోనే చెప్తానన్నారు.
సాయి శ్రీనివాస్ సినిమా కెరీర్‌లో సెటిల్ అవుతున్నాడని.. అతడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే శరణ్ ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని బెల్లంకొండ సురేష్ అన్నారు. శరణ్‌ను వదిలిపెట్టమని.. లీగల్‌గా ఎదుర్కొంటామని చెప్పారు. అవసరమైతే పరువునష్టం దావా వేస్తామని తెలిపారు. పిల్లలే తనకు పంచప్రాణాలని.. అలాంటిది శరణ్ తన కుమారుడి జోలికి వచ్చాడన్నారు. అతడి విడిచిపెట్టేదే లేదని సురేష్ వ్యాఖ్యానించారు.