అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు భారీగా పెరగంతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతుండటంతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. శ్రీలంకలో ఎవరూ ఊహించని రీతిలో అక్కడి ఆయిల్ విక్రయ సంస్థ ఎల్ఐఓసీ పెద్ద మొత్తంలో రేట్లు పెంచేసింది. లీటర్ డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 రూపాయిల భారం వేసింది. దీంతో ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.254కి, డీజిల్ రూ.214కి చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ తగ్గడంతోనే ఎల్ఐఓసీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ఆయిల్ ధరలు కూడా పెంచేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపైనా ఉండే వీలుంది. ముఖ్యంగా అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల మనపై ప్రభావం చూపనుంది. లీటర్ పె ట్రోల్‌పై రూ.12 వరకు పెరిగే సూచనలున్నట్లు ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని భావించినా ఇప్పటి వరకైతే ఆ దిశగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉంటుందని ఇంధనరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.