విజయవాడ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (రీషఫిల్)పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈరోజు ఉదయం శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ రీషఫిల్‌పై సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది పోటీలో ఉన్నారని.. ఇప్పటి వరకు కేబినెట్‌లో లేనంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్లు కాదని చెప్పారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి వస్తే మంత్రివర్గంలో ఉండేది మీరేనని.. కేబినెట్‌లో చోటు దక్కనివారు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని గతంలో జగన్ ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు అవుతోంది.
ఈ నేపథ్యంలో కేబినెట్ రీషఫిల్‌ను దృష్టిలో ఉంచుకునే సీఎం ఈ కామెంట్స్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈనెల 15న వైఎస్సార్‌సీపీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో కేబినెట్ రీషఫిల్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది.