దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని మిగిల్చాయి. ఎంతో చరిత్ర కలిగిన హస్తం పార్టీ.. కొత్తగా ఎక్కడా అధికారంలోకి రాకపోగా ఉన్న పంజాబ్‌లోనూ అధికారాన్ని కోల్పోయింది. జాతీయ పార్టీ అయినప్పటికీ నాయకత్వ లేమి, పార్టీలో ఉన్న గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఈ దీనస్థితిని తీసుకొచ్చాయి. యూపీలో ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. కేవలం రెండుస్థానాలకే పరిమితమైంది. పంజాబ్‌లో ఆప్‌తో హోరాహోరీ ఉంటుందని భావించినా అలాంటిదేమీ లేకుండానే నామమాత్రంగా 18 స్థానాలే దక్కాయి. ఇక ఉత్తరాఖండ్‌లో గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నా అక్కడా 19 సీట్లే గెలుచుకోగలిగింది. ఇక గోవాలో 12 స్థానాలతో పర్వాలేదనిపించినా.. మణిపూర్‌లో ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అక్కడ కేవలం 4 స్థానాలే దక్కాయి.
గతమెంతో ఘనం.. కానీ..
కాంగ్రెస్ పార్టీ గతమెంతో ఘనంగా ఉండేది. కానీ పరిస్థితి రానురానూ మారిపోయింది. పదేళ్ల క్రితం వరకు దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం కొంత ఉండేది. అందుకే పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దిల్లీ, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఆ తర్వాత కాలంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చింది.
పార్టీలో కుమ్ములాటలు.. వర్గపోరు..
అయితే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు.. రాష్ట్రాల్లో నేతల మధ్య కుమ్ములాటలు, వర్గపోరు పార్టీ పూర్వవైభవాన్ని క్రమంగా కోల్పోతూ వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల తర్వాత దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ హస్తం పార్టీని ప్రజలు తిరస్కరించారు. లేటెస్ట్‌గా ఇప్పుడు పంజాబ్‌లోనూ అధిరానికి దూరమైంది. ఇక ఆ పార్టీకి అధికారం మిగిలిన రాష్ట్రాలు కేవలం రెండు మాత్రమే.. ఒకటి రాజస్థాన్, రెండు ఛత్తీస్‌గఢ్. దేశంలో కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. 2024 సాధారణ ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితికి చేరుతుందో చెప్పలేం. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేకపోయింది. వచ్చే ఎన్నికల నాటికైనా పుంజుకుంటుందా? మరింత దిగజారిపోతుందా? అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.