హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించి సహకారం అందిస్తున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి థాంక్స్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకి ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందిస్తున్న సహకారం సినిమా ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ అవుతుందన్నారు.
మరోవైపు ఏపీలో టికెట్ ధరలను సవరిస్తూ ఇచ్చిన జీవో సంతృప్తికరంగా ఉందని రాజమౌళి అన్నారు. ఈ జీవోతో సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ధరల సమస్య పరిష్కారం కావడంలో సహకరించిన ఏపీ మంత్రి పేర్ని నానికి ఆయన థాంక్స్ చెప్పారు. ఈ మేరకు రాజమౌళి ట్వీట్ చేశారు.
ఏపీ ప్రభుత్వం ఇష్యూ చేసిన టికెట్ ధరల జీవోపై ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు ఫిల్మ్‌ఛాంబర్ సభ్యులు కూడా సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ త్వరలో విడుదల కానుంది. ప్రముఖ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ సినిమా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన కార్యక్రమాలను మూవీ టీమ్ వేగవంతం చేయనుంది.