హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో గన్‌పార్క్ వద్ద టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ తీసుకురాలేదని ఆరోపించారు. మతకలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఏడేళ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇప్పటికే లక్షా 33 వేల ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిందని.. ఇప్పుడు 91వేల ఉద్యోగాలకు ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నామన్నారు. యువతకు మంచి చేయాలని సీఎంకు ఉందని.. దేశాన్ని బాగుచేయాలంటే కేసీఆర్ వల్లే అవుతుందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రైవేటు రంగంలో మంత్రి కేటీఆర్ చొరవతో 15లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు.