తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని రఘునందన్ రావు సభలో ప్రసంగానికి అడ్డు తగలడం మొదలెట్టారు.దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ సెషన్ ముగిసేవరకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే అసెంబ్లీలో ఒక పార్టీకి చెందిన సభ్యులు ఇలా.. ఓ సెషన్ మొత్తం సస్పెండ్ అవడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదు. ఇప్పటివరకు మొత్తం మూడు సార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. తొలిసారిగా 2017లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆందోళన చేశారని అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను స్పీకర్.. సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
అలాగే అదే ఏడాది గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్ పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా సభ కు ఆటంకం కలిగించారన్న కారణంతో.. నాడు సభ లో ఉన్న మొత్తం ఐదుగురు బీజేపీఎమ్మెల్యేలపైనా సెషన్ వేటు పడింది. మళ్లీ 2018లో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు అడ్డుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను గవర్నర్ వైపునకు విసరడంతో.. అది పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ కన్నుకు తగిలింది. ఈ ఘటనలో వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ను శాసనసభ నుంచి బహిష్కరించగా.. మరో 11 మంది కాంగ్రె స్ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.