నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖతో సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి . అలాగే తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్త్రీలు ఇంటిపట్టునే ఉండకుండా.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అందుకు మనమెంతో గర్వించాలి. అలా వాళ్లు ఎదగడానికి మన వంతు సహకారం కూడా అందించాలి.
నేను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి నా భార్య సురేఖనే కారణం. మా కుటుంబ బాధ్యతల్ని సురేఖ తీసుకుంది. ఆమె అండగా నిలవడంతోనే ధైర్యంగా సినిమాలు చేశాను. ఇంట్లో వారి గురించి సురేఖ ఎప్పుడూ ఆలోచిస్తుంది. కోట్లాది రూపాయల భూమిని అందరికీ పంచాలని కోరింది’.. అంటూ చిరంజీవి ఆవిడపై ప్రశంసలు కురిపించారు.