హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతోషం వ్యక్తం చేసింది. సవరించిన ధరలతో జీవో ఇష్యూ చేయడంపై సీఎం జగన్‌కు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవో అందరికీ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో పాటు నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల అంశంపై చొరవ తీసుకున్న ప్రముఖ నటుడు చిరంజీవితో పాటు నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తికి ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు థాంక్స్ చెప్పారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఇండస్ట్రీకి సంబంధించి ఇతర సమస్యలనూ పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి కోరారు. టికెట్ రేట్ల విషయంలో తమ అభ్యర్థనను విని అమలు చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ తరఫున సీఎం జగన్‌కు థాంక్స్ చెప్తున్నామన్నారు. విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే మళ్లీ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను తీర్చేందుకు చిరంజీవి ముందుకొచ్చారని.. ఆయనే తమకు పెద్ద అని వ్యాఖ్యానించారు. త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎంలను సన్మానిస్తామని తెలిపారు. వివాదాలకు పుల్‌స్టాప్ పెడుతూ టికెట్ రేట్లపై ఏపీ జీవో ఇవ్వడం ఆనందంగా ఉందని కల్యాణ్ చెప్పారు.
నిర్మాత జెమినీ కిరణ్ మాట్లాడుతూ కొత్త జీవోతో నిర్మాతలకు మంచి లాభాలొస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవో ఎన్నో సంవత్సరాల సమస్యకు చెక్ పెట్టిందని ఎన్వీ ప్రసాద్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిశ్రమతో ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటాయని చెప్పారు. మిగిలిన చిన్నచిన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామన్నారు.