వనపర్తి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని.. అందుకే టీఆరెస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రేపు ఉదయం నిరుద్యోగులంతా టీవీ చూడాలని.. 10 గంటలకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని చెప్పారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో చెప్తామన్నారు.
అప్పుడు రూ.3లక్షలు.. ఇప్పుడు రూ.3కోట్లు
వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు, బీడు భూములు కనిపించేవని.. ఇప్పుడు పాలమూరు జిల్లాలో పాలు కారుతోందని చెప్పారు. హైదరాబాద్ నుంచి గద్వాల వరకు గ్రీనరీ కనిపిస్తోందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వజ్రపు తునకగా మారుతుందని చెప్పారు. ఒకప్పుడు ఈ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవాళ్ళని.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరు వస్తున్నారన్నారు. వనపర్తిలో ఒకప్పుడు ఎకరం 3లక్షల రూపాయలు ఉంటే.. అది ఇప్పుడు 3 కోట్లు అయిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ జరిగిన అభివృద్ధి దేశం మొత్తం జరగాలన్నారు.
బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి
సొంత రాష్ట్రం వస్తే ఇలా బతుకుతాం అని చెప్పాం..చేసి చూపించామన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే మరింత అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. దేశంలో మత, కుల పిచ్చి లేపి రాజకీయాలను మంట గలిపే ప్రయత్నాలు చేస్తున్నారని.. తన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ కు ఆ పరిస్థితి రానివ్వనని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని.. దేశంలో మంచిని కాపాడేందుకు అవసరమైతే తన ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ స్పష్టం చేశారు.