దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అని కేసీఆర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. యాంటీ బీజేపీ ఫ్రంట్ సాగిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌ను సరైన మార్గంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరగాలని.. ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఎటువంటి ఫ్రంట్ లేదని, ఏర్పడబోయే ఫ్రంట్ మున్ముందు తెలుస్తుందన్నారు. 75 ఏండ్లలో ఆశించిన రీతిలో దేశం వృద్ధి చెందలేదన్నారు.. అచ్ఛే భారత్ విషయంలో మీ తోడ్పాటు కూడా అవసరమన్నారు.. అచ్ఛే భారత్, ప్రస్తుతం ఉన్న భారత్ కన్నా మెరుగైన దేశాన్ని సృష్టించాలన్నారు. అన్ని రంగాల్లో .. వివిధ నేతలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మున్ముందు మరిన్ని విషయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాస్త ఓపిగ్గా ఉంటే.. మున్ముందు విపులంగా విషయాలను వెల్లడిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
గల్వాన్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. ఇవాళ జార్ఖండ్‌లో రెండు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాం. గల్వాన్ కాల్పుల్లో మరణించిన కల్నల్ సంతోష్ మా తెలంగాణ బిడ్డే. ఆ కుటుంబంతో మిగతా అమరుల కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.