తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీని వినియోగించుకొంటున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారని తాజాగా విడుదల చేసిన స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్‌స్ట్రాక్ట్-2022 వెల్లడించింది.ఆబ్‌స్ట్రాక్ట్ ప్రకారం.. 2020-21లో 1.07 లక్షల మంది ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరున్నర నెలల్లో 75 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 77 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా రూ.2 లక్షల వరకు చికిత్స అందిస్తున్నది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సంఖ్య అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నమోదవుతున్నది. ఏటా 12 వేలకు పైగా క్లెయిములు వస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, కార్పొరేట్ దవాఖానలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా క్లెయిములు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి తక్కువగా కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తక్కువగా క్లెయిములు నమోదవుతున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ తోడైంది. ఫలితంగా చికిత్స వ్యయం రూ.5 లక్షలకు పెరగ్గా, వ్యాధుల కవరేజీ 1,393కు పెరిగింది.