ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వివరించారు. పోలీసులు నమ్మకపోవడంతో చాలా సేపు అయ్యన్నపాత్రుడి ఇంట్లోనే ఉండి చివరకు ఇంటికి నోటీసులు అంటించిపోయారు.
టీడీపీ సీనియర్ నాయకుడిపై 153 ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ మాట్లాడుతూ..అయ్యన్న పాత్రుడు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడుతున్నారని, బూతులు మాట్లాడే వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అయ్యన్నపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.