పురాణాల్లో రాముడు ఎక్కడ కాలు పెడితే అక్కడ రాయి అహల్య అయిందని.. నేడు సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం సన్యశ్యామలం అవుతోందని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ మన గురించి ఆలోచించలేదు. ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ వస్తున్నాయి. 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది. రోడ్లు వచ్చాయి. సాగునీరు కూడా ఇప్పుడు రాబోతోంది. మన గురించి సీఎం కేసీఆర్ ఆలోచించి.. 4000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలను సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. మంజీరాలో వరద వస్తే ఆనీళ్లు వెళ్లి గోదావరిలో కలవడం మనకు తెలుసు. కానీ.. మన సీఎం గోదావరి నీళ్లను వెనక్కి మళ్లించి.. మంజీరాలో కలిపే అద్భుత కార్యక్రమాన్ని కల్పిస్తున్నారు. ఎక్కడో 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ కు, మల్లన్న సాగర్ నుంచి సింగూర్ కు, సింగూర్ నుంచి జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌కు అందించబోతున్నారు.. అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
కోటి ఎకరాల మాగాణిగా మన తెలంగాణను ఏడేండ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌ది. నేను గతంలో నారాయణఖేడ్‌లో పనిచేసినప్పుడు ఒక సామెత ఉండేది. గోరెంచకు పిల్లనియ్యొద్దు.. హద్దునూరుకు ఎద్దును ఇవ్వొద్దు అనే సామెత ఉండేది. ఇవాళ మీ దయతో మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయి. దీంతో గోరెంచకు నీళ్లు వచ్చాయి. త్వరలో ఈ ప్రాజెక్టులతో హద్దునూరుకు ఎద్దు కూడా ఇస్తారు.. అంటూ మంత్రి హరీశ్ రావు వాడుకలో ఉన్న సామెతను గుర్తు చేశారు.