అంతా ఊహించినట్లే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్‌ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ రోహిత్‌ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు.
మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పనిభారం కారణంగా పొట్టి ఫార్మాట్ నుంచి విరామం ఇచ్చిన సెలెక్టర్లు.. సీనియర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాను టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు.
దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్న బీసీసీఐ.. ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాను భవిష్యత్తు కెప్టెన్‌లుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నది. గాయాల కారణంగా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ రెండు సిరీస్‌లకూ దూరం కాగా.. కోలుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చారు. పంత్‌కు విశ్రాంతినివ్వడంతో పొట్టి సిరీస్ కోసం సంజూ శాంసన్‌ను ఎంపిక చేయగా.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.