తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాజకీయాలు వీడి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్లమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి పాలైనా రాజకీయాలను వీడక, ముందుకు సాగారని గుర్తుచేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో గేట్వే ఐటీ పార్కుకు, మేడ్చల్ మండలం పూడూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు.. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కండ్లకోయలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు.