దివంగత యువనటుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సింది. అయితే ఈ మూవీ ఒక సీన్ లో క్లాస్ రూమ్ లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్ సునీల్‌ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేదాకా నేను కూర్చోను అని సునీల్ అంటాడు. దానికి ధర్మవరపు సుబ్రమణ్యం.. నేను క్షమాపణ చెప్పాలా? వాళ్లెవరో అనటం ఏంటి? నేను క్షమాపణ చెప్పడం ఏంటి? హో.. హో.. ఇది భలే ఉంది అని అంటాడు.
సీన్ కట్ చేస్తే.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అలాంటి వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. అయితే, సీఎం కేసీఆర్ అన్నాక మెల్లిగా నిద్రలేచిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎంపై ఫిర్యాదుకు పిలుపునిచ్చింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిమంత బిశ్వ శర్మపై ఫిర్యాదు చేశారు.
అనంతరం మాట్లాడుతూ ‘మేము ఫిర్యాదు చేశాం.. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని అస్సాంకు పంపించి, అస్సాం సీఎంను అరెస్టు చేయాలి’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పైగా.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నామని, లేకపోతే రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, 33 జిల్లాల ఎస్పీ కార్యాలయాలను ముట్టడిస్తామని, నిరసన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఇదీ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వ పటిమ. రేవంత్ డిమాండ్‌పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు .