పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.
వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అయితే, దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి. ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరచినట్లుగా పడతాయి. కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి, దేవుడి సేవలో వినియోగిస్తారు. దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఏ దోషమూ ఉండదు. అలాగే, చాలా ఎత్తు ఎదిగే పొన్న చెట్టు (దేవ వల్లభం) కూడా దేవతా వృక్షమే.
‘ఓం చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః’ అని లలితాదేవిని ఆరాధిస్తారు. పొడుగాటి కాడలతో చాలా ఎత్తులో వికసించే పున్నాగలను రాల్చకూడదు. కార్తికం మొదలు మాఘ మాసం వరకు విరివిగా పూసే ఈ పూలు రాలిన ప్రదేశాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. కిందరాలినా వీటికి ఏ దోషం ఉండదు కాబట్టి దేవుడికి నిస్సంకోచంగా సమర్పించవచ్చు.