ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాలు అన్నంక గెలుపోటములు ఉంటాయని.. వాటన్నిటిని సమానంగా తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవకున్నా పరిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ .
కర్ణాటకలో వీళ్లు గెలవలేదు. కానీ పరిపాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గెలవలేదు కానీ పరిపాలిస్తున్నరు. గోవాలో గెలవలేదు కానీ నిన్నటి దాకా పరిపాలించారు. మణిపూర్‌లో గెలవలె కానీ పరిపాలిస్తున్నరు. మహారాష్ట్రలో గెలవలె.. మబ్బుల 3 గొట్టంక దొంగ ప్రమాణస్వీకారం చేపిచ్చిరు. తెల్లారెసరికి వాడు ఎదురు తంతె ఎల్లెలకల పడి సిగ్గుమానం తీసుకున్నరు. మహారాష్ట్రలో బీజేపీ పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆడిన నాటకంపై చర్చ పెడదామా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి.
అన్ని గెలవం. రాజకీయాలు అన్నంక, ఎన్నికలు అన్నంక అక్కడ ఉండే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తం. కొన్ని ఓడిపోతం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు? ఓడిపోయినంత మాత్రన ఈ అడ్డదారులు ఎందుకు? దేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్దతిలోనేనా దేశం బాగుపడేది. అన్ని రంగాలు నిర్వీర్యం అయినయి. సబ్సిడీలు కట్ చేస్తున్నరు. పేదల నోరు కడుతున్నరు. ఇప్పుడు మళ్లీ బీజేపీ గొడ్డలి భుజాల మీద పెట్టుకుని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్స్ ఓట్లు డబ్బల పడ్డ తెల్లారే పెట్రోల్ రేట్లు మళ్ల పెంచుతరు. ఇదంత మోదీ నాయకత్వంలోని బీజేపీ అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు.