మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ ఏడాది కోటి మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 నుంచి 19 వరకు జరుగనున్న దేశంలోనే అతిపెద్దదైన మేడారం జాతర కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జంపన్న వాగులోకి నీటిని విడుదల చేశామని తెలిపారు. జాతరకు దేవాదాయ, ఇంజినీరింగ్ విభాగాల పనులన్నీ పూర్తి కావొచ్చాయని చెప్పారు.
జాతరకు ఆర్టీసీ 3,850 ప్రత్యేక బస్సుల ద్వారా 21 లక్షల మందిని చేరవేసేందుకు చర్యలు తీసుకొంటున్నదని వివరించారు. మేడారంలో ప్రధాన దవాఖానతోపాటు మరో 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. 327 ప్రదేశాల్లో 6,700 టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఐదు వేల మందిని జాతర కోసం నియమించామని వివరించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ 9,000 సిబ్బందిని నియమించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్‌లు అధర్ సిన్హా, రజత్ కుమార్, అరవింద్ కుమార్, ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, జయేశ్ రంజన్, కార్యదర్శులు రిజ్వీ, క్రిష్టినా జొగ్తు, శ్రీనివాసరాజు, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు నాగిరెడ్డి, సంజయ్ జైన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్. ఇంజినీరింగ్ విభాగాల ఈఎన్సీలు పాల్గొన్నారు.