సంపాదించడమే కాదు సంపాదించిన సంపదలో ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కొరకు తిరిగి ఇవ్వడం కూడా ముఖ్యమేనని భావించి హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు తన స్వంత గ్రామం వరికోలు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీకి 44 లక్షల 65 వేల రూపాయలు చెక్కులు అందించారు. ఈ వితరణ డబ్బును గ్రామంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని సూచించారు. వరికోలు గ్రామ అభివృద్ధికి తన వంతు సాయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పోచంపల్లి చొరవతో ఈ వితరణ జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆప్టిమస్ డ్రగ్స్ కంపెనీ కి కృతజ్ఞతలు తెలిపారు. తనవంతుగా సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ఇప్పటికే చేస్తున్న వరికోలు అభివృద్ధికి తోడుగా, ఆప్టిమస్ డ్రగ్స్ కంపెనీ ముందుకు రావడం, విరాళాన్ని ఇవ్వడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
వరికోలులో అత్యాధునిక గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, రైతు వేదిక భవనం, శివాలయం నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అవడం జరిగింది. ఇంకా మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్, అనేక నిర్మాణాలు పూర్తవుతున్నాయని వివరించారు.