పచ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది.2019తో పోల్చితే 2021 నాటికి రాష్ట్రంలో పచ్చదనం 3 శాతం పెరిగిందని రాజ్యసభలో వెల్లడించింది. రాజ్యసభ సభ్యులు కుమారి సింగ్‌డియో, డాక్టర్ జయంతకుమార్‌రాయ్ దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్‌ఎఫ్‌ఆర్)-2021’ వివరాలను ఉటంకించారు. గత నెల 13న విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2019తో పోల్చితే 2021 నాటికి 632 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగింది. మూడు శాతం పెరుగుదల నమోదైంది. ఈ మూడేండ్లలో దేశవ్యాప్తంగా 1,540 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగింది. ఇందులో తెలంగాణ వాటా ఏకంగా 41 శాతం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అటవీ విస్తీర్ణం 24 శాతం మాతమ్రే ఉండేది. దీనిని 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆరువిడతల్లో చేపట్టిన హరితహారంలో 176.52 కోట్ల మొక్కలను నాటారు. దీంతోపాటు అటవీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఏపీ), కాంపెన్సేటరీ ఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద క్షీణించిన అడవుల్లో అటవీ పునరుద్దరణ కార్యక్రమాలను చేపట్టారు. కొత్త అడవులను సృష్టించడం, అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు, నేషనల్ బాంబూ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని కేంద్ర పర్యావరణశాఖ పేర్కొన్నది.