ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయంతో, సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు భారత ప్రధానిపై వ్యతిరేకంగా చిన్నగా కూడా స్పందించడానికి జంకుతున్న సందర్భంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధానిని విమర్శించి.. ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర సంస్థల దాడులను ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండటమే మేలని దేశంలోని కుటిల రాజకీయనాయకులు ఆలోచిస్తున్న సమయం కూడా ఇదే.ఈ నేపథ్యంలోంచి పరిశీలించినప్పుడు.. మోడీ ప్రభుత్వతీరును బేషజాలు లేకుండా చీల్చిచెండాడుతూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇటీవలి సీఎం కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశం సోషల్ మీడియా వేదికల్లో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ప్రెస్ మీట్ ద్వారా సీఎం ఇచ్చిన సందేశం చేరుకోవాల్సిన ప్రజలకు చేరుకొని లక్ష్యాన్ని సాధించింది. సందర్భోచితంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగిస్తూ కొన్నిసార్లు స్వచ్ఛమైన ఉర్దూ భాషా పదాలను ప్రయోగిస్తూ.. సమయమొస్తే తాను నోర్మూసుకొని ఉండే రకాన్ని కాదనే విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ స్పష్టం చేశారు.మోడీ డ్రెస్ కోడ్ ను అంశంగా ఎంచుకుని దుయ్యబట్టడం ద్వారా మోడీకి వ్యతిరేకంగా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న మొదటి హయాంలో అనేకసార్లు భేషరతుగా మద్ధతిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు బీజేపీపై నిజంగానే కోపంగా ఉన్నారా? అంటే కాదు అనే చెప్పవచ్చు.
వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ అందరు రాజకీయనాయకుల్లా కాకుండా, భావోద్వేగాలకు అతీతంగా రాజకీయాలు చేసే నాయకుడు. ఎన్నికల రాజకీయాలను ఆయన ఎన్నడూ తేలిగ్గా తీసుకోడు. అతని రాజకీయ దాడి శైలి గెరిల్లా యుద్ధాన్ని మాదిరి ఉంటుంది. అనూహ్యమైన భాషను ఉపయోగిస్తూ, అనూహ్యమైన దిశలనుండి దాడి చేస్తారు. ఊహించని ప్రశ్నలను సంధిస్తారు. ఇదంతా కూడా తాను లక్ష్యం చేసుకున్న ప్రత్యర్థిని బలహీనపరిచి ఆత్మరక్షణలో పడేసి, చిత్తుచేసే ఎత్తుగడలే. ఇదే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా కెసిఆర్ అవలంబించారు. మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సింగరేణి సమ్మెలతో పాటు బతుకమ్మ, తెలంగాణ సంబురాలు వంటి తదితర తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను కూడా ఉద్యమరూపాలుగా మలిచారు. ఇటువంటి అనూహ్య కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యతిరేకశక్తులు కెసిఆర్ ధాటికి తట్టుకోలేక గాలికి కొట్టుకపోయారు.కెసిఆర్ అనుసరిస్తున్న ఇటువంటి వినూత్న కార్యక్రమాలు మీడియా దృష్టిని కూడా ఉద్యమ సమయంలో విపరీతంగా ఆకర్షించాయి. తద్వారా ఉద్యమానికి విపరీతమైన మీడియా కవరేజి దక్కింది. అది కేసీఆర్ కు అనుకూలంగా జాతీయ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసింది. చివరికి కేంద్రం కెసిఆర్ కు తెలంగాణను అప్పగించేందుకు మీడియా కవరేజీ పెద్దపీట వేసింది.అట్లా ఎనిమిదేండ్ల తర్వాత తిరిగి ప్రెస్ మీట్ ద్వారా తన అస్త్రశస్ర్తాలను కెసిఆర్ బయటికి తీస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగారనేది నిప్పులు చెరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ నిదర్శనంగా నిలిచింది. దేశ ప్రజలతో పాటు మీడియా కూడా బిజెపి కి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నది. ఈ సెంటిమెంటును కేసీఆర్ పసిగట్టారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తాను జాతీయ రాజకీయాల్లో గౌరవప్రదమైన ప్రముఖస్థానాన్ని సంపాదించుకోగలుగుతానని భావిస్తున్నారు. అందు కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇది జాతీయ రాజకీయాల దిశగా కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.టిడిపి వ్యవస్థాపకుడు ప్రముఖ నటుడైన స్వర్గీయ ఎన్టీఆర్ పట్ల అమిత గౌరవాన్ని ప్రదర్శించే కేసీఆర్ ఆయన అడుగుజాడల్లోనే జాతీయ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ మాదిరే కేసీఆర్ కు కూడా వాగ్ధాటి, చక్కటి ప్రసంగాలు ప్రజలను ఆకర్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎం.కె.స్టాలిన్, పినరయి విజయన్ వంటి దక్షిణ భారత రాజకీయ నాయకుల కంటే కేసీఆర్ ను మందుంచడంలో హిందీ మరియు ఉర్దూపై ఉన్న పట్టే కలిసి వస్తున్నది. ఇంగ్లీషు భాషలో కేసీఆర్ కున్న పట్టు, వాగ్ధాటి క్లిష్ట సమస్యలను కూడా సమర్ధవంతంగా అత్యంత అర్థవంతంగా చెప్పగల సామర్ధ్యాన్ని కెసిఆర్ కు కల్పించింది. ఈ సామర్థ్యమే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి భావోద్వేగానికి ప్రభావితమౌతూ ప్రసగించే నాయకుల కంటే కేసీఆర్ ను ముందంజలో ఉంచుతున్నది.
రాజకీయ పరిణితితో కూడిన కేసీఆర్ చురుకైన పాలనా ఎత్తుగడలు, సందర్భానుసారంగా పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులను అనుసరిస్తూ సాగే రాజకీయ చతురత, అతన్ని జాతీయ రాజకీయాల ప్రస్థానంలో ముందుంచడానికి ఉపయోగపడుతున్న ముఖ్యమైన అంశాలు.గల్లీ నుంచి ఢిల్లీకి దృష్టిసారించడం కేసీఆర్ వ్యూహంలోని మరో ముఖ్యమైన అంశం. ఎయిర్ ఇండియా, ఎల్ఐసి వంటి కేంద్ర సంస్థల ప్రైవేటీకరణ అనే జాతీయ సమస్యలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, తనమీద వున్న రెండు దఫాల పాలనా ప్రభుత్వ వ్యతిరేకతా ప్రభావం తగ్గడపోవడమే కాకుండా తటస్థీకరించబడే అవకాశాలున్నాయి. కేసీఆర్ ఉపయోగించే రాజకీయ అస్త్రశస్త్రాలను తట్టుకోలేక బీజేపీ ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడిపోవడం ఖాయం.జాతీయ ఆకలి సూచీ, జిడిపి, ద్రవ్యోల్బణం తదితర జాతీయ అంశాలే చర్చనీయాంశాలైతే బిజెపి ని ఎవరు సమర్ధిస్తారు? ఇదే విషయాన్ని బాగా అర్థం చేసుకున్న కేసీఆర్ జాతీయ సమస్యలను ఎజెండా మీదికి తెచ్చి తద్వారా స్థానిక సమస్యలను ప్రజల మనస్సులోంచి తొలగించాలని భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అభివృద్ధిని తన అమ్ములపొదిలో ఉంచుకొని, బిజెపిని ఆత్మరక్షణలో పడేసి, కాంగ్రెస్ ను అసలు ఆటలో లేకుండా చేయడమే కేసీఆర్ అద్భుతమైన రాజకీయ వ్యూహం.హైదరాబాద్ ను ట్రంప్ కార్డుగా ఎంచుకోవడం ద్వారా తెలంగాణను ఐక్యం చేయడమేకాకుండా, తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ చుట్టూ అందమైన వలయాన్ని సృష్టించాడు. మున్సిపల్ శాఖామంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీ రామారావు వినూత్నరీతిలో చేపడుతున్న ఫ్లై ఒవర్ నిర్మాణాలు, వేలాడే వంతెనలు, భూగర్భమార్గాలు వంటి వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ ప్రజలు అమితంగా ఆకర్షిన్నాయి. నిత్యం హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేటీఆర్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలుపాలి.ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అనుసరిస్తూ సాగుతున్న కేసీఆర్ రాజకీయ వ్యవహారం బిజెపి ని తిరిగి హిందూత్వ సెంటిమెంట్ మీద ఆధారపడే రాజకీయాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులవైపు నెట్టడం ఖాయం.
తద్వారా మత రాజకీయాల విషయంలో బిజెపిపై ఆరోపణలు గుప్పించే క్రమంలో కేసీఆర్ రాజకీయ యుక్తుల అమలుకు మరింత ఆస్కారం దొరుకుతుంది.అభివృద్ధి కేంద్రంగా ప్రధాన చర్చ సాగినప్పుడు కేసీఆర్ కు హైదరాబాద్ అభివృద్ధి, వ్యవసాయరంగ అభివృద్ధిని చూపించగలరు. కానీ అదే బిజెపికి 2019లో సాధించిన విజయాలను కూడా నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. జాతీయ సమస్యలపై చర్చ మళ్లినప్పుడు టీఆర్ఎస్ సేఫ్ జోన్ లో ఉంటుంది. ఇదే కేసీఆర్ సాధించదలుచుకున్న ముఖ్య విషయం కూడా.సన్నిహితవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ అమ్ములపొదిలో ఇంకా పలు అస్త్రాలు ఉన్నట్టు సమాచారం. చైనా చొరబాటు నుంచి మొదలుకుంటే ప్రైవేటీకరణ దాకా, క్రిప్టో కరెన్సీ నుంచి మొదలుకుంటే నదుల అనుసంధానం దాకా బిజెపి పై ప్రయోగించడానికి కెసిఆర్ వద్ద అస్త్రాలు సిద్ధమవుతున్నాయి.కాంగ్రెస్ ను కనీసంగా పరిగణనలోకి తీసుకోకూడదనే లక్ష్యం కేసీఆర్ వ్యూహంలో ఉన్నది. బిజెపి కి వ్యతిరేక పోరాటంలో తానే బలమైన పోరాట యోధుడిగా నిరూపించుకోవడం ద్వారా బిజెపి వ్యతిరేక ఓట్లన్నీ టీఆర్ఎస్ వైపు మళ్లనున్నాయి. ఈ ఎత్తుగడ కాంగ్రెస్ ను, వామపక్షాలను మరింతగా బలహీనపరుస్తుంది. కెసిఆర్ వ్యూహం విజయవంతం అవుతుంది.
-SandeepReddy Kothapally