తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు.
ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డాక్టర్ డి.నాగార్జున్… అలాగే న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడా విజయభాస్కర్ రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్, ఎన్వీ శ్రవణ్ కుమార్‌ను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం ప్రతిపాదించింది.
దీంతో రాష్ట్ర హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 31కి చేరనుంది. తెలంగాణ హైకోర్టు ఏర్పడినప్పుడు 24 మంది జడ్జీలను కేటాయించారు. గతేడాది ఈసంఖ్యను 42కు పెంచారు. ప్రస్తుతం 19మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. తాజా నియామకాలకు ఆమోదం లభించినా ఇంకా 11మంది న్యాయమూర్తుల అవసరం ఉంటుంది. కాగా, తాజాగా సిఫారసు చేసిన జువ్వాడి శ్రీదేవి నిర్మల్ జిల్లాకు చెందినవారు. తెలంగాణకు చెందిన మహిళకు హైకోర్టు జడ్జిగా అవకాశం దక్కడం ఇదే తొలిసారి.