కాంగ్రెస్ పార్టీకి ప్రేమికుల రోజునే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ ఇబ్రహీం ప్రకటించారు. బుధవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, అందుకు ప్రేమికుల రోజును ఖరారు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేశాక ఏ పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందో చూద్దామని దాటవేశారు. 14 తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు.
కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. తన ముందు జేడీఎస్, టీఎంసీ, సమాజవాది పార్టీలు ఉన్నాయన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పగటికల మాత్రమే అన్నారు.
సిద్దరామయ్య నిస్సహాయులయ్యారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిందని ఎద్దేవా చేశారు. హోదా కంటే మర్యాద ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌లో నమ్మకద్రోహం జరిగిందన్నారు. విధానపరిషత్ ప్రతిపక్ష స్థానానికి 22 మంది ఎమ్మెల్సీలలో ఏకంగా 19 మంది తనకు మద్దతిచ్చారని, ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్ నేత వేణుగోపాల్ మాట్లాడారన్నారు. అయినా అవకాశం లభించలేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో మరెంతకాలం వేచి ఉన్నా భవిష్యత్ ఉండదని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.