వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 96 పరుగుల ఘన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలా పడింది. 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 96 పరుగులతో విజయకేతనం ఎగరవేసింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం లభించలేదు. 37 పరుగులకే ఓపెనర్లు రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) వికెట్లను చేజార్చుకుంది. కానీ, భారత కెప్టెన్ యశ్ ధుల్(110 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 110) శతకానికి వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (108 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 94) సమయోచిత బ్యాటింగ్ తోడు కావడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులను భారత బౌలర్లు ప్రారంభం నుంచే దడ పుట్టించారు. దీంతో ఆసీస్ జట్టు మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కోరె మిల్లర్(38), క్యాంప్‌బెల్(30) జోడి ఇండియన్ బౌలర్లను కొద్దిసేపు పరీక్షించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్యయాన్ని రఘువంశీ విడగొట్టాడు. ఆ తర్వాత కంగారు జట్టు క్రమం తప్పకుండా వికెట్లు పారేసుకుంది. దీంతో ఆసీస్ ఏ దశలో లక్ష్యం దిశగా కొనసాగలేదు. చివరకు 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో టీమిండియా 96 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో విక్కీ ఓత్సవల్ 3 వికెట్లు, రవి కుమార్, నిశంత్ సంధు చెరో 2 వికెట్లు తీస్తే.. కుశాల్ తాంబే, రఘువంశీ తలో వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన భారత సారథి యశ్ ధుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇక ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో యువ భారత్ తలపడనుంది.