పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్‌కు కాంగ్రెస్ త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం.
పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) రాహుల్ గాంధీ పంజాబ్‌లో పర్యటిస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని జనవరి 27న రాహుల్ పంజాబ్‌లో పర్యటించినపుడు చెప్పారు.
పార్టీ కార్యకర్తలను సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తమలో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ సహకరిస్తామని సిద్ధూ, చన్నీ హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సిద్ధూ డిమాండ్ చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. శక్తి యాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆమె కోరినట్లు సమాచారం.