తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరస్పర బదిలీల(మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వుల(జీఓ నెంబర్ 21)ను జారీ చేశారు. పరస్పర బదిలీల కోసం వచ్చే నెల 1 నుంచి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎ్‌ఫఎంఐఎస్) ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. నిజానికి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన, కేటాయింపులు, పోస్టుల్లో చేరిక ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. అయినా.. మొదట భార్యాభర్తల కేసులు పరిగణనలోకి తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. వీటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు రావడం, పరిష్కరించడం పూర్తయింది.
ఆ తర్వాత పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. అయితే.. పరస్పర బదిలీల సందర్భంలో పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బదిలీ కోరుకునే ఉద్యోగులు తమ సీనియారిటీని వదులుకోవాలని, కేటాయించిన జిల్లాలో చివరి ర్యాంకులో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవీ మార్గదర్శకాలు…
- ఒకే కేటగిరీ పోస్టుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగుల మధ్య పరస్పర బదిలీని అంగీకరిస్తారు. ఉదాహరణకు ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులే పరస్పర బదిలీని కోరాల్సి ఉంటుంది.
- రెండు వేర్వేరు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల మధ్య పరస్పర బదిలీ ఉండదు. ఉదాహరణకు రెవెన్యూ శాఖలోని సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు మధ్య పరస్పర బదిలీలకు అనుమతించరు.
- వేర్వేరు శాఖల్లోని ఒకే కేటగిరీ పోస్టుల మధ్య పరస్పర బదిలీలు ఉండవు. ఉదాహరణకు వ్యవసాయ శాఖలోని సూపరింటెండెంట్, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్‌లు పరస్పర బదిలీ చేసుకోవడానికి వీల్లేదు.
- పరస్పర బదిలీలు కోరుకునే ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు తప్పనిసరిగా రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం చేపట్టిన ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో బదిలీ అయి ఉండాలి.
- ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ల బదిలీల విషయంలో ఇద్దరూ తప్పనిసరిగా ఒకే యాజమాన్యం కింద పని చేస్తున్నవారై ఉండాలి. ఒకే కేటగిరీ, ఒకే సబ్జెక్టు, ఒకే మీడియంకు చెంది ఉండాలి.
- జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, ఇతర స్థానిక సంస్థలలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది బదిలీలకు సంబంధించి.. ఇద్దరు ఉద్యోగులు ఇతర జడ్పీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థలకు చెంది ఉండాలి.
- పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలో తమ సీనియారిటీని వదులుకుంటున్నట్లు, చివరి ర్యాంకులో చేరడానికి ఇష్టపూర్వకంగా ఉన్నట్లు అండర్‌టేకింగ్‌లు సమర్పించాలి. అంటే కొత్తగా చేరే జిల్లాలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాలో వీరు చివరన ఉంటారు.
- ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి రవాణా భ త్యం(టీఏ), కరువు భత్యం(డీఏ) చెల్లించదు.
- కోర్టు ఆర్డర్ల మేరకు లోకల్ కేడర్‌లో పని చేస్తున్నవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు, అనధికార గైర్హాజరైనవారు పరస్పర బదిలీల కింద దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
- ఒక ఉద్యోగి ఒకరికంటే ఎక్కువ మందితో పరస్పర బదిలీలకు అంగీకారం కుదుర్చుకోరాదు.
- పరస్పర బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సంబంధించిన పత్రాలను సంబంధిత విభాగాధిపతులకు సమర్పించాలి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే ఇక ఆ తర్వాత ఎలాంటి దిద్దుబాటుకు అవకాశం ఇవ్వరు.
- ఒక శాఖలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆ శాఖ విభాగాధిపతి పరిశీలించి, అర్హమైనవాటిని తమ శాఖ ముఖ్యకార్యదర్శికి పంపించాలి. ముఖ్యకార్యదర్శి వాటిని పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు.
- ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 1 నుంచి మార్చి 15 వరకు మధ్య కాలంలో సమర్పించాలి. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో ఐఎ్‌ఫఎంఐఎస్ ద్వారా తమ అధికారులకు పంపించాలి.
- ఏదేని పరిపాలన సంబంధిత కారణాల రీత్యా ఒక ఉద్యోగి దరఖాస్తును ప్రభుత్వం రద్దు చేయొచ్చు.