కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉందని ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్ గా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలను వెల్లడించారు.రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పట్టించుకోవడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఏడేళ్లు సహనంతో ఉన్నామని ఇక ప్రజాపోరాటం ద్వారా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధిస్తామని, అందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర, జిల్లా ప్రజా ప్రయోజనాల విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని, నయా పైసా ఇవ్వలేదని, దీనిని ఎండగట్టాలని బీజేపీ ఎంపీలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సారి బడ్జెట్ లోనూ జిల్లాకు కేంద్ర మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా వివక్షకు గురై, సుదీర్ఘ పోరాటాల అనంతరం కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను ఉదారంగా ఆదుకోవాల్సిన కేంద్రం ఏడేండ్లుగా చిన్నచూపు చూస్తున్నదని రాష్ర్టానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై బీజేపీ నాయకులు ఏనాడూ నోరెత్తింది లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వజమెత్తారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, రవాణా అభివృద్ధికి చర్ల నుంచి ఏపీలోని రాజమండ్రి వరకు గోదావరి జల మార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ పోర్టుకు తరలింపు, భద్రాచలం – కొవ్వూరు, మణుగూరు – రామగుండం రైల్వే ప్రాజెక్టులు, ఉత్తరాదిన గంగా నది తరహాలో గోదావరి నది కాలుష్య నివారణ కు కేంద్ర నిధులు మంజూరు వంటి తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసి, సాధించాలని హితవు మంత్రి పలికారు.ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విద్య, ఉపాధి సంస్థలను జిల్లాలో నెలకొల్పే విధంగా నిధులు కేటాయించాలని మంత్రి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దును ఉన్న గ్రామ పంచాయితీల విలీనం, ఆ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.కొత్తగూడెం విమానాశ్రయం ప్రతిపాదన చేసిన కార్యరూపం దాల్చలేదన్నారు. దేశంలో దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం కు రవాణా సౌకర్యం కొరకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు, భద్రాచలం – కిరండోల్ రైల్వే లైన్ నిర్మాణం పై దృష్టి సారించాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.