ఆపద అని చెప్పగానే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయటంలో సీఎం కేసీఆర్ ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెలంగాణ ప్రజలకు అందిన సహాయం అరకొరే. 2004 నుంచి 2014 వరకు పదేండ్లలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి 1.85 లక్షల మందికి రూ. 750 కోట్లు మాత్రమే అందించారు.
అందులో తెలంగాణవారు 50 వేల మంది కూడా ఉండరని అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఏడేండ్లలో నాలుగు లక్షల మందికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఏకంగా రూ.2వేల కోట్లు సహాయం ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా సీఎంఆర్‌ఎఫ్‌కు ఒక సెక్షనే కేటాయించారు.
ఈ సెక్షన్‌లో దాదాపు 50 మంది వరకు నిరంతరం పని చేస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి వైద్య సహాయం కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే పిలిపించి సరిచేసి దరఖాస్తును స్క్రూటినీ చేస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందించేలా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నది.