కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారత దేశంలో ద్వితీయ, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని కేసీఆర్‌కే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా సాధించిన విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి మంత్రి సంబురాల్లో పాల్గొన్నారు.
వైద్య సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా పూర్తి చేసిన కరీంనగర్‌లోని బుట్టి రాజారాం కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్, గంగాధర, శంకరపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట పీహెచ్‌సీలకు రూ. లక్ష చొప్పున మంత్రి తన సొంత నిధుల నుంచి ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని అభిమానమని, ఆయనంటే కూడా ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమన్నారు. కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. సర్కారు చేపట్టే కీలక పథకాలను సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని గుర్తుచేశారు.
2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరీంనగర్ రెనోవేషన్ స్కీంకు రూ. 92 కోట్లు విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఒకప్పుడు కరోనా అంటే కరీంనగర్ భయపడిందని, ఇప్పుడు కరోనాను భయపెట్టే విధంగా తయారైందని చమత్కరించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది టీకాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేసిన కారణంగానే జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదని చెప్పారు. అనంతరం కలెక్టర్ కర్ణన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియాతోపాటు వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులను మంత్రి గంగుల ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.