Home / SLIDER / సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు

సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు

సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు త్రివిధ దళాధిపతులు సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు. త్రివిధ దళాధిపతులు సైతం అమరవీరులకు నివాళులర్పించారు.తెలంగాణ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, తాత్కాలిక సచివాలయం బీఆర్‌కే భవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైకోర్టులో చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాను ఎగురవేశారు.

రాజ్యాంగ నిర్మాతలు అందించిన సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించడానికి కంకణబద్ధులవుదామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అచంచల విశ్వాసంతో ప్రతిన బూనాలని పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకొనే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారతదేశ ప్రధాన లక్షణమని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ గొప్పతనమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి ప్రతీక అని వెల్లడించారు. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు. ఇది దేశ ప్రజల రాజనీతి దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు.

పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింతగా పటిష్ఠపరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను పొందుపరిచారని సీఎం అన్నారు. మన దేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయని తెలిపారు. ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’గా ప్ర పంచ రాజకీయ చిత్రపటంలో వెలుగొందుతున్న రాష్ట్రా ల హకులు మరింతగా సంరక్షించబడటంతోనే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశ దిశలా పరిఢవిల్లుతుందని స్పష్టంచేశారు. భారతదేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం, రాజ్యాంగం అందించిన ఫెడరల్‌ స్ఫూర్తిని ప్రారంభం నుంచి ప్రదర్శిస్తున్నదని తెలిపారు. రాజకీయాలను, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ నెరపుతున్న రాజ్యాంగబద్ధమైన రాజనీతి నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన సమాఖ్య స్ఫూర్తిని మరింత దృఢంగా కొనసాగించడానికి కంకణబద్ధులమై ఉందామని, అందుకు అచంచల విశ్వాసంతో ప్రతిన బూనుదామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat