ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటికి జ్వర సర్వే ముమ్మరంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న జ్వర సర్వేలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య సిబ్బంది సూచనలు మేరకు ఔషధాలను వాడాలని మంత్రి పువ్వాడ ఉద్బోధించారు.
కరోనా సోకినా వారు ఇంట్లోనే ఉంటూ హోమ్ ఐసోలేషన్ కిట్టులోని మందులను వినియోగిస్తూ, తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. కరోనా కిట్టులోని మందుల వలన వ్యాధి పూర్తిగా తగ్గుతున్నదని అందువలన దైర్యంగా ఉండి చికిత్స పొందాలని అయన కోరారు. జ్వరం తీవ్రంగా ఉండి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండటంతో పాటుగా ఆక్సిజన్ లేవల్స్ పడిపోయినట్లయితే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చేరాలని ఆయన కోరారు.
కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి అప్పులపాలు కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి అజయ్ కుమార్ వివరించారు రాష్ట్రంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడుతున్నదని తెలిపిన మంత్రి.. ఖమ్మం నియోజకవర్గంలో మొదటి డోస్ వాక్సిన్ తీసుకోని రెండవ డోస్ తీసుకోని వారందరికీ వెంటనే వ్యాక్సినేషన్ చేయాలని అధికారులను, ప్రభుత్వ డాక్టర్లను, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు మరియు రెండవ డోస్ తీసుకున్న 60 ఏండ్ల పైబడిన వారందికీ కరోనా నివారణ చర్యల్లో భాగంగా బూస్టర్ డోస్ వెయ్యాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.