‘‘మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ నరహంతకుడు. పట్టపగలే ఆ రాష్ట్రంలో ఆరుగురు రైతులను కాల్చి చంపించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఆయన కుటుంబసభ్యులపై ఉన్నా యి. అవినీతి ఊబిలో మునిగి దొడ్డి దారిన ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన ఘనత ఆయనది. అలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి వచ్చి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు.
ఏదిబడితే అది మాట్లాడొద్దు. ఇక్కడి అభివృద్ధిని చూసి మీ కేంద్రమంత్రులే మా రాష్ట్రాన్ని మెచ్చుకున్నారు. మరోసారి అవాకులు చెవాకులు పేల్చితే సహించం’’ అంటూ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖహారి అన్నట్లుగా మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లో ఉపాధి లేక లక్షలాది మంది కూలీలు పొట్ట చేతబట్టుకొని తెలంగాణ వచ్చి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కొత్త జోన్లతోనే సాధ్యమని భావించి.. ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. దీనికి సంబంధించిన 317 జీవో కూడా కేంద్రం ఆమోదించిన యాక్ట్ ప్రకారం విడుదలైందన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని బీజేపీ నేతలు రాజకీయం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.